5, డిసెంబర్ 2020, శనివారం


#అంబేద్కర్_అందరివాడు. 


 ఈ రోజు భారతదేశపు అణగారిన వర్గాల, ఆశాజ్యోతి, హక్కుల నేత, దేశపు మొట్టమొదటి న్యాయశాఖామంత్రి, రాజ్యాంగ నిర్మాత, ప్రజాస్వామ్య భారతదేశం యొక్క దశ దిశ నిర్దేశించిన,  భారతరత్న బోధిసత్వ డా. బాబాసాహెబ్ అంబేద్కర్ భౌతిక నిష్క్రమణం చెందిన రోజు. అరవై ఐదేళ్ళు వివిధ రకాల వివక్షకు వ్యతిరేకంగా నిత్యపోరాటంలో గడిపి, బడుగుబలహీనుల, స్త్రీల హక్కులకోసం జీవితాన్ని ధారబోసిన నిత్య కృషీవలుడు, అలసి ఆఖరిశ్వాస వదిలి నేటితో అరవై నాలుగేళ్ళు. ఇన్నేళ్ళ భారతదేశం, ఇన్ని వైరుధ్యాలూ విభిన్నతలూ గల  ఈ దేశంలో పేద ధనిక తేడాల్లేకుండా అందరికీ ఓటు హక్కును తేవడం దగ్గర్నుండి, చట్టం ముందు న్యాయం ముందు అందరూ సమానం అనే తిరుగులేని హక్కును ఈ దేశపౌరులందరికీ రాజ్యాంగం ద్వారా ప్రసాదించిన మహామనీషిని, కేవలం దళితసమూహాల ప్రతినిధిగా కొందరు కుట్రపూరితంగా ప్రచారం చేశారుగానీ, నిజానికి ఆయన అందరివాడు, విశ్వమానవుడు.  


ఆయన ఆలోచనా విధానం గత కొన్నేళ్ళుగా విస్తృతంగా భారతదేశాన్ని ఆవరించడం నిజమే, కానీ, బ్రతికున్నరోజుల్లో సైతం "బడుగుబలహీన సమూహాలచేతగానీ, కులాల అంతరాలను మెచ్చని మేధోవర్గం చేతగానీ ఆయన మిక్కుటంగా ప్రేమింపబడ్డ వ్యక్తి" అంటారు ఆయన సన్నిహితులు. ఆయన సహాయకుడూ, అత్యంత సన్నిహితుడూ ఐన, నానక్ చంద్ రత్తూ రచించిన "రిమినిసెన్సెస్ అండ్ రిమెంబరెన్సెస్ ఆఫ్ డా. బీఆర్ అంబేడ్కర్" అనే పుస్తకంలో ఆయన ఇలాంటి ఎన్నో వాస్తవాలు పొందుపర్చారు. బాబాసాహెబ్ మరణించినపుడు లక్షలాదిగా కన్నీళ్ళతో తరలివచ్చిన ప్రజలను ఆయన గుర్తుచేసుకొంటూ, "ఆయన్ని దళితజాతి మాత్రమే కాదు, భరతజాతి ముద్దుబిడ్డగా అభివర్ణిస్తారు. అందుకే ఎప్పటిలా కాకుండా ఈ వ్యాసంలో, బాబాసాహెబ్ ఒక నాయకుడిగా కాకుండా, ఒక వ్యక్తిగా, ఉద్వేగపూరితుడిగా, అందర్నీ ప్రేమించే సున్నిత స్వభావుడిగా, ప్రేమామయుడిగా ఎలా ఉండేవాడు, మరణానికి ముందు కొంతకాలంగా అస్వస్థుడిగా ఉన్న ఆయన, ఆఖరిగా ఏం మాట్లాడారు, తనప్రజలకు ఎలాంటి సందేశం ఇచ్చారు, ఆయన తీరని ఆశలు ఏమిటి తదితర విషయాల గురించి తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.


అందరికీ తెలిసిందే అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14 న మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లాకి చెందిన మ్హౌ అనే కంటోన్మెంట్ ఏరియాలో, రాంజీ సక్పాల్, భీమాబాయి దంపతులకు పధ్నాలుగో సంతానంగా జన్మించారని. నిజానికి వారిది రత్నగిరి జిల్లా లోని దపోలి. ఈస్టిండియా కంపెనీ ఇండియాని పాలించడం మొదలుపెట్టిన దగ్గర్నుంచీ అంబేద్కర్ కుటుంబీకులు ఆర్మీలో పనిచేసారు. అంబేద్కర్ పుట్టేనాటికి అతడి తండ్రి ఆర్మీలో సుబేదార్ ర్యాంకులో సేవలందిస్తూ ఉన్నారు. పుట్టిన వారిలో ఏడుగురు అప్పటికే చనిపోగా, కనిష్టుడైన అంబేడ్కర్ను "భీవా" అని ముద్దుగా పిల్చుకుంటూ, ఎంతో గారాబంగా పెంచారు ఇంటిల్లిపాదీ. బాల అంబేద్కర్ మొండివాడు, తాననుకున్నదే జరగాలనే గట్టిపట్టు పట్టేవాడిగా ఉండేవాడు, తోటిపిల్లలతో గొడవలకు కూడా దిగేవాడు. గెలిచి తీరాలన్న పట్టుదల అతడిలో చిన్నప్పటినుండీ కనిపించేది. చాలామంది అనుకుంటున్నట్టు, అంబేడ్కర్ కుటుంబం పేదది కాదు, అంబేడ్కర్ పుట్టిన కొద్దిరోజులకే రాంజీ సక్పాల్ రిటైర్ అవ్వడంతో, కుటుంబాన్ని దపోలిలో వదిలి, తాను గోరేగావ్ అనే ఊరిలో క్యాషియర్ పనిలో చేరారు. పుట్టిన కొద్దిరోజులకే తల్లిని పోగొట్టుకున్నాడు భీవా. ఆ తర్వాత అనతికాలానికే అతడి కుటుంబం దపోలి వదిలి సతారా చేరుకుంది. తల్లిలేక, అక్కలకు పెళ్ళిళ్ళైపోయి, ఉన్న అత్తకి ఆరోగ్యం బాలేని పరిస్తితుల్లో,  వంట చేసుకోవడం, ఇంట్లో పనులు చేసుకోవడం కష్టంగా ఉండేదని ,అందుకే అన్నం మాంసం కలిపి ఎక్కువగా పులావ్ వండేసుకునే వారిమనీ, నెమరువేసుకుంటారు బాబాసాహెబ్ తన స్వీయకధలాంటి "వెయిటింగ్ ఫర్ ఎ విజా" పుస్తకంలో.


అందరూ అనుకున్నట్లు, పుట్టింది మొదలు బాబాసహెబ్ అంటరానితనం అనుభవించలేదు. "మిలటరీ క్వార్టర్స్ లో, ఒక సుబేదార్ బిడ్డలుగా వారిపై ఎలాంటి వివక్షా వుండేది కాదనీ, సతారాకి వచ్చాక, ఒకసారి వేసవి సెలవులకి,  మరో ఊరిలో పనిచేస్తున్న వాళ్ళ తండ్రిగారిని కలవడానికి పిల్లలందరూ బయల్దేరినపుడు జరిగిన సంఘటనలు తనకు అంటరానితనం ఎంతటి అమానుషమైన ఆచారమో తెలిసేలా చేసాయనీ, పసిపిల్లలైన తమకు రోజంతా పచ్చి మంచినీళ్లు పుట్టకుండా చేసిన ఆ సంఘటన తన మనసులో తీవ్రంగా నాటుకుపోయిందనీ,  "మనిషిని మనిషి తాకితే మైల పడడం ఎలా సాధ్యం?" అని తనని పదే పదే ప్రశ్నించే విదేశీయులకు, కుల వివక్షను అర్ధం అయ్యేలా చెప్పడానికి తాను ఈ పుస్తకం రాయాల్సి వచ్చిందనీ" అంబేద్కర్ ఆ పుస్తకం మొదటి పేజీల్లో చెప్పారు. తన జీవితం నుండీ ,తాను సన్నిహితంగా చూసిన వారి జీవితాల నుండీ కులవివక్ష తీవ్రంగా బాధించిన సన్నివేశాలను వివరించడం ద్వారా, కుల వివక్ష యొక్క స్వరూపాన్ని తెలియజేయడానికి ప్రయత్నించారు అంబేడ్కర్, మరి ఆ పుస్తకానికి "వెయిటింగ్ ఫర్ ఎ విజా" అని శీర్షిక పెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటో ఆయనెక్కడా చెప్పినట్టు లేరు, ఈ పుస్తకం అసంపూర్తిగా ఉండగానే ఆయన మరణించారు.


ఈనాడు ప్రపంచం మొత్తం బాబాసహెబ్ ను ఒక మహామనీషిగా, అణచివేయబడ్డ జాతుల హక్కులకోసం జీవితాంతం శ్రమించిన కృషీవలుడిగా, ప్రపంచంలోనే గొప్ప మేధావిగా గుర్తించింది. ఆయనకున్నన్ని డిగ్రీలు కూడా మరింకెవ్వరికీ లేవని, మహోన్నత విద్యావేత్తగా, ప్రపంచమేధావిగా ఆయన్ని గౌరవిస్తోంది. భారతదేశం మొత్తంలోనే,  విదేశీ విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్ లో డాక్టరేట్ అందుకున్న మొట్టమొదటి వ్యకి డా. బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవన్నీ రోజూ మనం వింటూ ఉండే మాటలే అంబేద్కర్ గురించి. ఐతే, చదువు అంటే తెలియని సాంఘిక వెలివేతలో ఉన్న తమ సమూహాల నుండి, తమ బిడ్డను ఎలాగైనా విద్యావంతుడ్ని చేయాలనే పట్టుదల పట్టింది మాత్రం అంబేద్కర్ తండ్రి రాంజీ సక్పాల్. కొడుకులిద్దర్నీ స్కూల్లో వేయడమే కాకుండా, ఇద్దరి ఫీజులకీ తన పెన్షన్ సరిపోకపోవడంతో ఆ తర్వాత పెద్దకొడుకు బలరాంని కూడా చిన్న ఉద్యోగంలో చేర్పించి అంబేద్కర్ ని మాత్రం ఎల్ఫిన్స్టన్ హైస్కూల్లో, ఇంగ్లిష్ మీడియంలో జేర్పించాడు. అంటరానివాడు కావడం వల్ల ఎవ్వరూ అతడితో మాట్లాడకపోవడంతో,  భీవా ఒక్కడే వెళ్ళి సమీపాన ఉన్న తోటల్లో గంటలు గంటలు చదువుకునేవాడట. అలాంటి సమయాల్లో స్థానిక విల్సన్ హైస్కూలు ప్రిన్సిపాల్, సామాజిక వేత్త ఐన కేలుస్కర్ గారు భీవాని చూసి, ఆపై అతడి ఉన్నత విద్యను అభ్యసించడంలో ఎంతో సహకరించడం జరిగింది. అలాగే మరో బ్రాహ్మణ టీచర్ కూడా చదువులో భీవా యొక్క సూక్ష్మగ్రాహ్యతను గమనించి, ఆ అబ్బాయి మధ్యాహ్న భోజనానికి ఇంటికి వెళ్ళే అవసరం లేకుండా భోజనం ఏర్పాటు చేసారు. భీమ్రావ్ రాంజీ అంబావడేకర్ ఐన తన పేరు, ఆ తదుపరి స్కూలు రికార్డుల్లో "అంబేద్కర్" గా నమోదవ్వడానికి కారణం ఉత్తమ బుద్ధిగల ఆ ఉపాధ్యాయుడే అన్నది గెయిల్ ఓంవిడ్త్ అనే అంతర్జాతీయ రచయిత్రి రాసిన "అంబేద్కర్: టువార్డ్స్ యాన్ ఎన్లైటెన్డ్ ఇండియా"అనే పుస్తకంలో ప్రస్తావించబడింది.


తాను బియ్యే పాసవ్వాలని తన తండ్రి ఎంతో శ్రమించాడని అంబేద్కర్ చెప్పేవారు. తాను ప్రశాంతంగా చదువుకోవాలని తెల్లవారుఝామున రెండింటికే లేపేవారని, ఇంగ్లిష్, హిందీ అనర్గళంగా మాట్లాడగలిగే, రాయగలిగే తన తండ్రికి, తాను మామూలుగా కాకుండా డిస్టింక్షన్లో పాస్ కావాలని ఆశగా ఉండేదని, ఐతే తాను మొదట్లో తండ్రి ఆలోచనను పెద్దగా పట్టించుకోలేదనీ ,కానీ 1904 లో బొంబాయి వెళ్ళాక కావాల్సిన పుస్తకాలు లభ్యమౌతుండడంతో తనకూ చదువుపై మక్కువ కలిగిందనీ చెప్పేవారు బాబాసాహెబ్. కొడుకు బాగా చదవాలని ఒకటే వెన్నంటి ఉండి పోరుపెట్టేవారు రాంజీ. ప్రతిభావంతుడైన తన బిడ్డ అడిగిన పుస్తకం ఎంత ఖరీదైనాసరే,  తన పెన్షన్ డబ్బులతో కొనేసేవారట సక్పాల్. తన వద్ద డబ్బు ఐపోయినపుడు, తన సోదరి వద్దకు వెళ్ళి ఆమె నగలు తాకట్టు పెట్టి, డబ్బు తెచ్చి పుస్తకాలు కొని, మళ్ళీ తన పెన్షన్ వచ్చాక ఆమె నగలు విడిపించేవారట. ఇవన్నీ తెలుసుకుంటున్నప్పుడు, ఈనాటి సమాజం ముఖ్యంగా దళిత సమాజం ఆయన జీవించిన విధానం చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉందనిపిస్తుంది. పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలంటే చుట్టూ ఎలాంటి వాతావరణం సృష్టించాలి, అందుకు తల్లిదండ్రుల కృషి, శ్రమ ఏ స్థాయిలో ఉండాలీ అనేది అంబేద్కర్ తండ్రిగారిని చూస్తే అర్ధం ఔతుంది.


ఈ విషయాలన్నీ పంతొమ్మిదో శతాబ్ధం మొదట్లో, అంబేద్కర్ టీనేజర్ గా ఉన్నప్పటి సంఘటనలు. మరి వందేళ్ళ తర్వాత కూడా మెజారిటీ దళిత సమాజం అంతటి విద్యను సాధించిందా అంటే, సమాధానం వెంటనే చెప్పలేం. తల్లిలేని పిల్లవాడు,ఇంట్లో మంచీ చెడ్డా చూసుకునే ఎవ్వరూ లేనివాడు, తండ్రి యొక్క పట్టుదలను అర్ధం చేసుకొని రేయింబవళ్ళు చదవడం, ఆ తండ్రి, తలను తాకట్టు పెట్టైనా బిడ్డకు కావాల్సిన పుస్తకాలనూ ఫీజునూ సమకూర్చడం..ఒక సామాన్య వ్యక్తి యొక్క అసామాన్య విజయాలను మనం ఈరోజు వేనోళ్ళ కొనియాడుతున్నాం కానీ, ఆ విజయాల వెనుక ఉన్న కఠోర పరిశ్రమని మనలో ఎవరమైనా  పరిశీలించామా? ఆయన్ని ఒక సమూహానికే పరిమితం చేసి,సమానత్వ సమాజంకోసం, ఆయన అవిశ్రాంతంగా సలిపిన  శ్రమను ప్రజలకు తెలియజేయకుండా, పాఠ్యపుస్తకాల్లో ప్రచురించకుండా ఆయన్ని ఏడాదికి రెండుసార్లు పొగిడేసి చేతులు దులుపుకోవడం సమంజసమా? 


ఆయన విగ్రహాలని తమ మొగసాలల్లో ఒక ఆలంబనగా ప్రతిష్టించుకునే సమూహాలకు, కుల వివక్ష అనే క్యాన్సర్ ని నిరోధించడానికి ఆయన ఎంతగా తనను తను ఉపేక్షించుకొని, చట్టాలనన్నింటినీ ఔపోసన పట్టాడో అర్ధం చేసుకున్నాయా? ఇప్పటికైనా ఆయన్ని ప్రేమించే సమాజం, ఆయన పట్టుదలని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయన్ని దేవుడిగా కొలవడం కంటే ఆయనలాంటి మేధోసంపదని వారసత్వంగా గ్రహించడానికి అణగారిన వర్గాలు శ్రమించాలి. ఆర్ధికంగా ఎదిగిన దళితులు అంబేద్కర్ నిర్దేశించిన "పే బ్యాక్ టు ద సొసైటీ"ని సీరియస్ గా అమలుచేయాలి.


"మరణానికి కొన్నేళ్ళ ముందునుండీ బాబాసాహెబ్ ఆరోగ్యం బావుండేది కాదు. హిందూకోడ్ బిల్లు, రాజ్యాంగ రచన..వీటిల్లో,ఆయన ఇతర పుస్తకాల రచనల్లో అవిశ్రాంతంగా పనిచేస్తున్నపుడే ఆయనకు అపెండిసైటిస్, హైబీపీ, కీళ్లనొప్పులు ఉండేవి. ఆపై ఆయనకు చక్కెర వ్యాధికూడా సోకింది. తాను స్థాపించిన "రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా" పార్టీని నడుపుతారని, ఆయన ఆశయాల రధాన్ని ముందుకు తీసుకెళ్తారని నమ్మిన వారు అధికారంకోసం ఆయనకు ద్రోహం చేయడం ఆయన్ని కుదిపేసింది. తాను నమ్మిన తనవారే మోసం చేయడంతో ఆయన ఆరోగ్యం క్షీణించసాగింది. మందులు పనిచేయడం మానేసాయి. 1955 జనవరి నుండీ ఆయనలో మార్పు కొట్టొచ్చినట్టు కానరాసాగింది. బరువుతగ్గి, కంటి చూపు క్షీణించి, స్నానం చేయడానికీ, చిన్నచిన్న దూరాలు నడవడానికీ సైతం ఒకరి సాయం కావాల్సివచ్చేంతగా ఆయన నీరసపడిపోయారు. "ఇకపై నేను రాయలేనేమో రత్తూ, నేను అనుకున్న పుస్తకాలు పూర్తిచేయలేనేమో" అని మధనపడేవారు. ఏమీ తినడానికి ఇష్టపడేవారు కాదు. ఆయన్ని వేయి కన్నులతో కాపాడుకుంటూ ఆ మహామనీషి పక్కనే ఉండే అదృష్టం మాత్రం నాకు దక్కింది" అని గుర్తుచేసుకుంటారు బాబాసాహెబ్ ఆంతరంగికుడు, సహాయకుడు నానక్ చంద్ రత్తూ తన పుస్తకంలో.


"1956 జూలై 31 మంగళవారం ఆయన పడక్కుర్చీలో పడుకొని నాకు నోట్సు చెప్పడం ఆరంభించారు.అలా చెప్తూ చెప్తూ నిద్రలోకి జారిపోయారు. ఆయన తలని సరిగ్గా సర్ది, నేను అలా ఆ అలసిన ముఖాన్ని చూస్తూ కూర్చున్నాను. ఆపై ఆయనలేచి, కొన్ని ఉత్తరాలకు జవాబులు చెప్పారు.  తర్వాత మెల్లగా లేచి బెడ్రూలోకి నడిచారు, ఆయన తలను మెల్లిగా మర్దనా చేస్తుండగా ఆయన ఈ మాటలు చెప్పారు. "నా వేదన ఏంటంటే, నేను నా జాతికోసం ఏదైతే ఆశించానో అది జరగలేదు. ఇతర సమూహాలతో పాటూ నా జాతికూడా పరిపాలనను పంచుకోవడం చూడాలని ఎంతో ఉవ్విళ్ళూరాను. "నేనేదైతే సాధించి పెట్టానో దాన్ని, కొందరు విద్యావంతులు తమ స్వార్దానికి వాడుకున్నారే తప్ప, తమ వెనుక ఇంకా వివక్షలో జీవిస్తున్న తమ వర్గాల సోదరులకు అందించలేదు. వీళ్ళంతా స్వార్ధపరులు. నేనిప్పుడు నా ఆలోచనంతా గ్రామాల్లో అత్యంత హీనమైన రీతిలో బాధపడుతున్న అభాగ్యులవైపు మళ్ళించుకోవాలి అనుకుంటున్నాను. కానీ అంత సమయం లేదనిపిస్తుంది. నేను బ్రతికి ఉండగానే నేను రాసిన పుస్తకాలన్నీ అచ్చులో చూడాలి అనుకున్నాను, అదీ సాధ్యపడేలా లేదు.అది అసాధారణమైన పని, నా తర్వాత ఎవరూ ఆ పని చేయలేరేమో అనే బాధ నన్ను కృంగదీస్తుంది, నా తర్వాత బాధిత సమూహాలనుండి ఎవరైనా సమర్ధులు ఈ బరువైన బాధ్యతను కొనసాగిస్తారేమోనని ఆశించాను. కానీ ఎవ్వరూ వచ్చేలా లేరు"


"..కులవివక్షలాంటి మహాజాఢ్యం వేళ్ళూనుకుని ఉన్న దేశంలో పుట్టడమే ఒక శాపం.."అంటూ కళ్ళల్లో నీళ్ళతో చివరిసారిగా విస్తరించి సంభాషిస్తూ, "నానక్ చంద్, నేనేదైతే సాధించానో అది ఒంటిచేత్తో సాధించాను, అవమానాల మధ్య వేదనల మద్య నలిగిపోతూ, శత్రువులతో నిరంతరం యుద్ధం చేస్తూ,ఈ రధాన్ని ఇక్కడివరకూ చేర్చాను. అణచివేయబడ్డ కులాలు గౌరవ ప్రదమైన జీవితం జీవించాలంటే, వాళ్ళు ఇకపై కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటూనే ఈ రధాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలా చేయలేని పక్షంలో దాన్ని ఉన్నచోటే వదిలెయ్యాలి తప్ప, ఎట్టిపరిస్తితుల్లోనూ ఈ రధాన్ని వెనక్కి మాత్రం తీసుకెళ్ళరాదు. ఇది నా చివరి సందేశం, ఈ మాటలు వాళ్ళకి చెప్పు, వాళ్ళకి చెప్పు, వాళ్ళకి చెప్పు" అంటూ మూడుసార్లు ఉద్వేగంగా పలికారని రత్తూ తన పుస్తకంలో రాసుకున్నారు.


అంబేద్కర్ ఒక మేధో విస్ఫోటనం. బ్రతికిన అరవై ఐదేళ్ళలో ఆయన తనకోసం బతికిన రోజుల్ని వేళ్ళపై లెక్కపెట్టొచ్చేమో. ప్రజాస్వామ్య సమాజాన్ని అంతగా కలలుకన్న ప్రేమామయుడు బాబాసాహెబ్ అంబేడ్కర్. బాధిత సమూహాల మానవ హక్కుల పట్ల, సాంప్రదాయాలపేరుతో స్త్రీలపై అణచివేతను రూపుమాపడం పట్లా, తన తిరుగుబాటును తుపాకులతో తూటాలతో కాకుండా రాజ్యాంగంలో చట్టాల రీతిన పటిష్టంగా పొందుపరచి, వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దిన మహామనీషి. భారతదేశపు అణగారిన వర్గాలు మాత్రమే కాదు, ఈ దేశపు ప్రతీ పౌరుడూ పౌరురాలూ అన్ని హక్కులతో ప్రశాంత జీవనం గడపడానికి నిరంతరం శ్రమించి బాటలు వేసిన ఆయన, భౌతికంగా నిష్క్రమించి అరవైనాలుగు సంవత్సరాలు గతించినా, ఆయన ఆలోచనలే వివిధ చట్టాల రూపంలో ఈ దేశాన్ని నడిపిస్తున్నాయంటే, కోట్లాదిగా జనాభా ఉన్న ఈ దేశాన్ని ఇన్నాళ్ళపాటు ఎలాంటి సాంఘిక ,రాజకీయ ఆర్ధిక విపత్తూ కదిలించలేదంటే దానికి కారణం ఆయన రాసిన రాజ్యాంగమూ ఆయన చేసిన చట్టాలూ మాత్రమే.

భారతీయులందరూ ఇకనైనా తెలుసుకోవాల్సిన సత్యమిది, ఆ ప్రేమమూర్తిని హత్తుకోవాల్సిన సమయమిది.


( ఈ రోజు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 64 వ మహాపరినిర్వాణ దివస్)


అరుణ గోగులమండ. 

రచయిత సామాజిక విశ్లేషకురాలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి